ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 6, 7, 8 తేదీల్లో “సేవా సేతు అభియాన్” క్యాంపులురూఫ్‌టాప్ సోలార్‌పై ప్రజలకు అవగాహన – రూ.78 వేల వరకు సబ్సిడీ

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల డిస్కమ్‌ల పరిధిలో “సేవా సేతు అభియాన్” క్యాంపులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో ఈ క్యాంపులను నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో “సేవా సేతు అభియాన్” క్యాంపులను నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సీఎండీ పి. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ను చేరువ చేయడం, రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సేవా సేతు అభియాన్ ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు.
ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు.
రూ.78 వేల వరకు సబ్సిడీ
పథకం కింద అర్హత కలిగిన గృహ వినియోగదారులకు:
1 కిలోవాట్‌కు రూ.30,000
2 కిలోవాట్లకు రూ.60,000
3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000
వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని సీఎండీ తెలిపారు.
క్యాంపుల్లో పూర్తి సమాచారం
“సేవా సేతు అభియాన్” క్యాంపుల ద్వారా ప్రజలకు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ పొందే ప్రక్రియ, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు, నెట్ మీటరింగ్ తదితర అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ క్యాంపుల్లో బ్యాంకర్లు, సోలార్ విక్రేతలు, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొని వినియోగదారుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పథకం అమలుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనున్నారు.
ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే లక్ష్యం
అర్హత ఉన్న ప్రతి గృహ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తన ఇంటినే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని సీఎండీ పి. పుల్లారెడ్డి పిలుపునిచ్చారు.
రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో సేవా సేతు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, పథకం ప్రయోజనాలను అర్హులైన ప్రతి గృహ వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో సేవా సేతు క్యాంపులను సందర్శించి రూఫ్‌టాప్ సోలార్‌పై పూర్తి సమాచారాన్ని తెలుసుకుని పథకం ప్రయోజనాలను పొందాలని సీఎండీ పి. పుల్లారెడ్డి కోరారు.
పీఎం సూర్య ఘర్ పథకం లేదా సేవా సేతు క్యాంపులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఏపీసీపీడీసీఎల్ 1912 కాల్ సెంటర్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *