అద్దంకి : కొరిశపాడు – తిమ్మనపాలెం గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా చేపడుతున్న సర్వీస్ రోడ్డు పనులను గురువారం మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. సర్వీస్ రోడ్డు నిర్మాణంతో గ్రామంలో వర్షపు నీరు, మురుగు నీరు వెళ్లేందుకు మార్గం లేక ఇళ్లలోకి నీరు చేరుతున్న సమస్యను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. గ్రామంలోకి నీరు చేరకుండా, వర్షపు నీరు, మురుగునీరు బయటకు వెళ్లేందుకు అవసరమైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణ పనుల వల్ల గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై తిమ్మనపాలెం గ్రామస్తులు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి ధన్యవాదాలు తెలిపారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: