ప్రకాశం జిల్లాలోని సహజ ప్రాకృతిక వనరులను పరిరక్షిస్తూ, పర్యావరణ పరిరక్షణకు మరియు పారిశ్రామిక అభివృద్ధికి నడుమ సమతుల్యత సాధించేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగం సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. సుమారు నాలుగు దశాబ్దాలుగా జిల్లాలోని చీమకుర్తి పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉన్న ప్రసిద్ధ గ్రానైట్ గనులు, క్వారీలు మరియు పాలిషింగ్ పరిశ్రమల ద్వారా నిత్యం వెలువడుతున్న వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ బృహత్తర ప్రణాళికను ఆచరణలోకి తీసుకువచ్చే క్రమంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ (CSIR – Advanced Materials and Processes Research Institute, AMPRI) డైరెక్టర్‌తో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా చీమకుర్తి కేంద్రంగా నడుస్తున్న భారీ గ్రానైట్ పరిశ్రమల వల్ల వెలువడే వ్యర్థాల నిర్వహణ ఒక ప్రధాన సవాలుగా మారిందని పేర్కొన్నారు. గ్రానైట్ పాలిషింగ్ ప్రక్రియలో వైట్ లిక్విడ్ రూపంలో నిత్యం టన్నుల కొద్దీ ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలు (గ్రానైట్ స్లర్రీ) మరియు పాలిషింగ్ సమయంలో వచ్చే రాతి ముక్కలు, ఇతర ఘన వ్యర్థాలు (Solid Waste/Aggregates) పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాలు పెద్ద ఎత్తున నిల్వ ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లోని భూములు వ్యర్థాల దిబ్బలుగా మారి దుర్వినియోగం అవ్వడమే కాకుండా, ఎండిన స్లర్రీ నుండి వచ్చే ధూళి (Dust Pollution) మరియు నీటి కాలుష్యం వల్ల స్థానిక పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని వివరించారు.
ఈ క్లిష్టమైన పర్యావరణ మరియు భూసమస్యల పరిష్కారానికి సైంటిఫిక్ అప్రోచ్ (శాస్త్రీయ విధానం) అవసరమని భావించిన కలెక్టర్ గారు, CSIR-AMPRI డైరెక్టర్ మరియు సైంటిస్టుల బృందాన్ని సంప్రదించారు. చీమకుర్తిలోని క్వారీలు మరియు పాలిషింగ్ యూనిట్ల నుండి ఉత్పత్తవుతున్న ఈ స్లర్రీ, రాతి వ్యర్థాల పైన సమగ్రమైన పరిశోధన (Research) నిర్వహించాలని వారిని కోరారు. ఆ పరిశోధనా ఫలితాల ఆధారంగా ఈ వ్యర్థాలను ఇతర రకాల పర్యావరణహిత నిర్మాణ సామగ్రికా, ప్రత్యామ్నాయ ఉత్పత్తులుగా ఏ విధంగా మార్చవచ్చో సమగ్ర నివేదికను మరియు తగిన మార్గదర్శకాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.
సాంకేతిక ఆధారిత పరిశోధన పూర్తయిన తర్వాత, వారి ఇచ్చే సూచనలు మరియు వినూత్న పద్ధతుల మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ చర్యలు చేపడతామని కలెక్టర్ గారు తెలియజేశారు. దీని ద్వారా కాలుష్యాన్ని పూర్తిగా నివారించడమే కాకుండా, వ్యర్థాలతో కప్పడిపోయిన విలువైన ల్యాండ్ (భూమి)ని తిరిగి పూడ్చి వేరే ఉపయోగకరమైన కార్యక్రమాలకు వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ (DD) శ్రీ రామచంద్ర, ఏపీఐఐసీ (APIIC) జోనల్ మేనేజర్ / ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ శ్రీ మదన్ మోహన్, మరియు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: