హైదరాబాద్ నవంబర్ 7,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్, పౌర సమాజం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్’ (హెచ్‌సీఎస్‌సీ) నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. సంస్థ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు నూతన సెక్రటరీ జనరల్‌తో పాటు వివిధ ఫోరమ్‌లకు సంయుక్త కార్యదర్శులుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులను నియమించారు. హెచ్‌సీఎస్‌సీ నూతన సెక్రటరీ జనరల్‌గా ‘రీ సస్టైనబిలిటీ లిమిటెడ్’ వైస్ ఛైర్మన్, సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఎం. గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు.పర్యావరణ సేవలు, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల రంగాల్లో ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం ఉంది.
కౌన్సిల్‌లోని వివిధ ఫోరమ్‌ల సంయుక్త కార్యదర్శులుగా పలు రంగాల నిపుణులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ ఫోరం బాధ్యతలను అడెప్ట్ టెక్నాలజీస్ ఎండీ మహీప్ సింగ్ థాపర్, యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఆశా హాస్పిటల్ ఎండీ డాక్టర్ కె. చంద్రశేఖర్, సీనియర్ సిటిజన్స్ ఫోరంను జెటాటెక్ టెక్నాలజీస్ ఈడీ రవికుమార్ రాచకొండ పర్యవేక్షించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ఫోరం సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ అనిల్ రాచమల్ల, ఫిజికల్ సేఫ్టీ ఫోరం బాధ్యతలను డాక్టర్ హర ప్రసాద్ పాండా, సీఎస్సార్ విభాగం బాధ్యతలను ట్రూజోన్ సోలార్ ఎండీ భవానీ సురేష్ చేపట్టారు. ఆపరేషన్స్ విభాగానికి టీసీఎస్ సెక్యూరిటీ హెడ్ కమాండర్ శ్రీనివాస్ రెడ్డి, విమెన్ ఫోరం బాధ్యతలను ఎఫ్‌టీసీసీఐ మాజీ సీఈవో ఖ్యాతి నరవణే, ఎన్జీవోల సమన్వయకర్తగా ఐటీ రంగ నిపుణుడు విశాల్ ఆర్య నియమితులయ్యారు.ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ, హెచ్‌సీఎస్సీ చైర్మన్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ నియామకంతో పోలీస్ శాఖ, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల మధ్య సమన్వయం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి, మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. గతంలో విశిష్ట సేవలు అందించిన పూర్వ సెక్రటరీ జనరల్ సి. శేఖర్ రెడ్డితో పాటు పూర్వ సంయుక్త కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ తంగెళ్ల, లెఫ్టినెంట్ కల్నల్ కె.ఎస్. రావు, కేజీఎస్ఎస్ శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్‌ల సేవలను ఆయన కొనియాడారు. వారి హయాంలో చేపట్టిన మార్గదర్శక్, స్త్రీ సమ్మిట్, హ్యాక్, స్పందన ఈవీ వాహనాలు, సురక్షా నివాస్, సీసీటీవీ ప్రాజెక్టులు నగర భద్రతలో మైలురాళ్లుగా నిలిచాయని పేర్కొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: