ఉమ్మడి ప్రకాశం జిల్లా, పామూరు మండలం, బలిజపాలెంలో గ్రామ సర్వేయర్‌గా విధులు నిర్వహించే బుడమగుంట పవన్ కుమార్ ప్రమాదంలో చనిపోవడంతో ఆయన కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ప్యాకేజీ ‘ ద్వారా మొత్తం రూ.1.22 కోట్ల బీమా పరిహారము లభించింది. మృతునికి యూనియన్ బ్యాంకులో శాలరీ ఖాతా ఉన్నది. ఈ పరిహారంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా AP State Government Salary Package కింద రూ.1,20,00,000 (ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద అదనంగా రూ.2,00,000 (రెండు లక్షల రూపాయలు) మంజూరయ్యాయి.
ఈ రెండు బీమా క్లెయిమ్‌లకు సంబంధించిన మొత్తం రూ.1,22,00,000 (ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు) చెక్కును దివంగత ఉద్యోగి తండ్రి మరియు నామినీ అయిన బి. పరశురామరాజుకు ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి. రాజాబాబు గురువారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు. అదేవిధంగా, పరిహారం చెక్కును అందజేస్తూ ఈ మొత్తాన్ని కుటుంబ భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని నామినీకి సూచించారు. మృతుని స్వస్థలం సింగరాయకొండ మండలం పాకల గ్రామం.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు ప్రాంతీయ అధిపతి వి. రవికుమార్, ప్రాంతీయ కార్యాలయ చీఫ్ మేనేజర్ .డి. సత్యజిత్, గాంధీ రోడ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ సాహూ, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: