తాళ్లూరు మండలం కొర్రపాటి వారి పాలెం బస్టాండ్ ప్రాంతంలో వాగు ఓడ్డున జీవాల మృత దేహాలను పలువురు వేస్తుండటంతో ఈ ప్రాంతంలో బస్ కోసం వేచి ఉండు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ‘తాళ్లూరు, వెల్లంపల్లి రోడ్లో కొర్రపాటి వారి పాలెం నుండి నేరుగా బస్ సౌకర్యం లేక పోవటంతో ఒంగోలు ఇతర ప్రాంతాలకు వెళ్లు ప్రయాణికులు బస్ స్టేషన్ ప్రాంతంలో వేచి ఉంటారు. వారికి నిలువ నీడ లేక పోవటంతో స్పందించి ఆ గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు ఆ ప్రాంతంలో ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి నిథులతో బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టారు. చెట్టు, ప్రయాణికులు కూర్చోనేందుకు వీలుగా బెంచ్లను సైతం ఏర్పాటు చేసారు. దీంతో ప్రయాణికులకు కొంత సేద తీరినట్లయినది. అయితే ఇటీవల తరచూ జీవాల మృత దేహాలను ఆ ప్రాంతంలో వేస్తుండటంతో ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మానవతా దృక్పదంలో ఆలోచించకుండా ఇలా మూర్ఖంగా మృత దేహాలను వేయటంపై తీవ్రంగా ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయితీ శాఖ అధికారులు స్పందించి కనీసం ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించి పారిశుధ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

