ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరు లో గల శ్రీ మల్లమాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో మహాన్యాస పూర్వక, రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులైన దుర్బాకుల నగేష్ శర్మ, మిన్నీ కంటి శ్రీరామ మూర్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. భక్తులు పొంగళ్ళు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముండ్లమూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన వేంపాడు, పెదరావిపాడు, త మ్మలూరు , నాయుడుపాలెం, పోలవరం, శంకరాపురం, ఉల్లగల్లు, పసుపుగల్లు, చింతలపూడి, ఉమామహేశ్వరపురం, తదితర గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులేకుండా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివార్లను వాహనంపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామికి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమం నా ఊరే నా ఇల్లు ముండ్లమూరు కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.

