రాష్ట్రంలో పిల్లలందరూ బడిలో తప్పకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్దేశించినట్లుగా విద్యార్థుల నమోదు 100శాతం పూర్తిచేయడానికి రాబోయే 15 రోజులు చాలా కీలకమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2005 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో గానీ, కళాశాలలో గానీ ఉండాలని తెలిపారు. వంద శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జిఇఆర్) ఉండాలనే లక్ష్యం ఉండాలని జిల్లాలోని వాలంటీర్లందరికీ తెలపాలని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ విద్యార్ధులను మరలా పాఠశాలల్లో చేర్చించాలని తెలిపారు. విద్యార్థి సమాచార పోర్టల్లో విద్యార్థులందరి పేర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల నమోదు పై రాష్ట్రకార్యాలయం నుంచి జోన్ల వారీగా అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. కడప జోన్ పరిధిలోని కలెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గుంటూరు జోన్ కలెక్టర్లను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, విశాఖపట్నం జోన్ కలెక్టర్లను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్, కాకినాడ జోన్ కలెక్టర్లను పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కమిషనర్ భాస్కర్ పర్యవేక్షిస్తారని వివరించారు. ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ, టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని తెలిపారు.
పిల్లలందరూ బడిలో ఉండాలి -టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు కూడా-పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
02
Jul