దర్శి పల్లెవనం పార్కులో ఇటీవల జరిగిన రూ.45 లక్షల అవినీతిపై ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణ గోపాల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శి టౌన్ పర్యటనలో భాగంగా శనివారం శ్మశానాల ఆక్రమణలు పరిశీలించారు. వెంటనే ప్రహరీలు, ఇతర సెక్యూరిటీ, సౌకర్యలు కల్పించాలని నగర పంచాయతీ కమిషనర్ మహేష్ ను ఆదేశిం చారు. అనంతరం పల్లెవనం పార్కు పరిశీలించారు. పార్కులో అవినీతిపై అధికారుల ఎదుటే ఎమ్మెల్యేకు స్థానికులు, విలేకరులు ఫిర్యాదు చేశారు. అక్కడ పని చేస్తున్న వారికి జీతంలో సగం జీతం రూ.7500 మాత్రమే ఇచ్చి వేలు ముద్రలు వేయించుకుంటున్నారని, అవికూడా సంవత్సరం పూర్తి అయిన తరువాతే ఇస్తున్నారన్నారు. నాలుగు నెలలుగా ఎటువంటి పనులు చేయకుండామూసివేశారన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ…నెలాఖరులోగా పనులు మొత్తం పూర్తి చేసి లెక్కలు చెప్పాలని రేంజ్ అధికారి ఏవీ నాగేం ద్రరావును ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎమ్మె ల్యేను నువ్వే పిలిపించావంటూ…స్థానికుల సమక్షంలోనే బీట్ అధికారి అమరపై రేంజ్ అధికారి నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీట్ అధికారి కన్నీటి పర్యంతమై అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైసిపి మండల పార్టీ కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కౌన్సిలర్ విసిరెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



