సమాజంలో తగిన సేవలు అందించటం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణ అన్నారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సీ) లో బాగంగా సోమవారం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను స్వీకరించే కార్యక్రమం కలెక్టర్ కాన్ఫిరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లా ఎస్సీ సంక్షేమశాఖాధికారి ఎన్. లక్ష్మానాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ మానవుడు జీవితంలో జన్మకి, మరణానికి మధ్య సమాజంలో చేసిన సేవ స్థిరమైన గుర్తింపును ఇస్తుందని చెప్పారు. సమాజంలో సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు తగిన వసతి, ఇతర సేవలను అందిస్తే జీవితంలో విద్యార్థుల ఉన్నతికి చేయూత ఇచ్చిన వారు అవుతారని అన్నారు. ఇది ఉన్నతమైన భావి భారత తరాన్ని తయారీలో సీఎస్సీ ద్వారా మీ భాగస్వామ్యం ఉన్నట్లవుతుందని అన్నారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖాధికారి లక్ష్మానాయక్, భూ గర్భ గనుల శాఖాధికారి జగన్నాధ రావు, జిల్లా పారిశ్రామిక శాఖాధికారి శ్రీనివాసరావు, మత్యశాఖ జెడీ అవుల చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ కార్పోరేట్ సామాజిక బాధ్యత ద్వారా సంక్షేమ శాఖ వసతి గృహా విద్యార్థులకు అందించాల్సిన సేవల వివరాలను వివరించారు.



