పల్నాడు జిల్లా, చిలకలూరిపేట బొప్పూడి వద్ద “ప్రజా గళం” పేరుతో ఆదివారం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల కూటమి ఏర్పాటు చేసిన ఎన్నికల శంఖారావం సభ లక్షలాది మంది ప్రజల రాకతో దిగ్విజయంగా జరిగినదని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ ధనిశెట్టి రామునాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో బిజెపి, తెదేపా, జనసేన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారని, మోదీ తమ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి హిందీలో కొనసాగించారని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం చేశారని తెలిపారు.
వికసిత భారత్ కోసం మరియు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మా ఎన్డిఏ కూటమికి 400 లోక్ సభ సీట్లు సాధించేలా ఓటర్లు తమకు ఓటు వేయాలని మరియు కోటప్పకొండ త్రిమూర్తుల ఆశీస్సులు లభించాయని ప్రధాని తమ ప్రసంగంలో పేర్కొన్నారని ధనిశెట్టి తెలిపారు.
సభ ఆద్యంతం అత్యంత సజావుగా సాగేందుకు పార్టీ వాలంటీర్లతో పాటు పోలీస్ సిబ్బంది సహకరించారని మరియు అవసరార్థులకు వైద్య సేవలు సక్రమంగా అందాయని, పార్టీ శ్రేణులు వచ్చిన ప్రజలకు మజ్జిగ మంచినీరు విరివిగా అందించారని, ఆయా ప్రభుత్వ శాఖలకు ధనిశెట్టి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా నలుమూలల నుండి ప్రజాగళం సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేమంగా తమ గమ్యాలకు చేరుకోవడానికి కృషిచేసిన పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.
