జంతువులపై ప్రతి ఒక్కరూ ప్రేమను చూపించాలని తీర్థ్ సుందర్ మహారాజ్ పిలుపు నిచ్చారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడానికి ఏర్పాటైన జీహెచ్ఎస్పీసీఏ అధ్వర్యంలో సికింద్రాబాద్, సింధి కాలనీ
లోని జైన్ మందిర్ లో ఆదివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జంతు ప్రేమికులు పాల్గొని తమ అమూల్యమైన సలహాలు, సూచనలు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తీర్థ్ సుందర్ మహారాజు మాట్లాడుతూ జంతువులను కూడా తమలాగే జీవులుగా పరిగణించి వాటిపై ప్రేమను చూపాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ జంతు పరిరక్షణ సంస్థ సలహా దారు మహిప్ జైన్ మాట్లాడుతూ మూగ జీవాల పరిరక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మానవుల వలె వాటికి కూడా జీవించే హక్కు ఉందని తెలిపారు. దాహం, ఆకలి అని పశుపక్ష్యాదులు అడగలేవని వాటికి మన వంతు కర్తవ్యంగా ఆహారం, నీరు కల్పించాలని అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్ లో మూగ జీవాలకు వైద్య సహాయం అందించడం కోసం అత్యాధునిక యంత్ర పరికరాలతో హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ చైర్మన్ మేనకా గాంధీ హైదరాబాద్ లో 550గజాల స్థలం కేటాయించారని పేర్కొన్నారు. ఈ స్థలంలోనే హాస్పిటల్ నిర్మాణం చేపట్టి అన్ని జీవాలకు ఉచితంగా వైద్య సహాయం, చికిత్సలు అందించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న 10ఒంటెలను గుర్తించి అసిఫ్ నగర్ పీఎస్ లో పిర్యాదు చేయడంతో పాటు కోర్టు ఆదేశాల ప్రకారం రాజస్థాన్ లోని మహావీర్ కామెల్ సంచూరికి తరలించినట్లు మహిప్ జైన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యానిమల్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు గిరీష్ శా, ప్రముఖ నటుడు అశోక్ కుమార్, అద్యక్షుడు దినేష్ అంచాలియ, వ్యవస్థాపక కార్యదర్శి సురేందర్ బండారి, కోశాధికారి జోషి, సమన్వయ కర్త సౌధర్మ్ బండారి, పశువైద్యుడు డా. విశ్వ చైతన్య లు పాల్గొన్నారు.

