చండ ప్రచండంగా నిప్పులు కురిపిస్తున్న ఎండ. అయినా లెక్క చేయని అభిమానం.. పశ్చిమ ప్రకాశం జన సంద్రమైంది. తమ గుండెల నిండా నింపుకున్న అభిమాన ధనుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూసేందుకు ఊళ్లకు ఊళ్లు కదిలి వచ్చాయి. కర్షకులు, కార్మికులు, మహిళలు పనులు పక్కన పెట్టి దండుగా తరలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు తమ కుటుంబ సభ్యుల తోడుగా వచ్చి ఎదురు చూశారు. పిల్లలు, యువత రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొడుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల యుద్ధానికి మేమంతా సిద్ధమంటూ నినదించారు. ఊరూరా జనాభిమాన కెరటమై ఉప్పొంగింది. ప్రత్యర్థుల పాడు చూపులు సోకకుండా అక్క చెల్లెమ్మలు ఆడపడుచులుగా గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. పూల వర్షం కురిపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఊరూరా అదే అభిమానం, అదే ఆప్యాయతలతో ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్రకు ఆదివారం జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను వివరిస్తూ వారిని తరిమికొట్టాలని ఇచ్చిన జగన్ సింహనాదంతో ‘మేమంతా సిద్ధం’ అంటూ పశ్చిమ ప్రకాశం దద్దరిల్లింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, భారీ బహిరంగ సభకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పోటెత్తారు. బస్సు యాత్ర పెద్దారికట్ల వద్ద మార్కా పురం నియోజకవర్గంలోకి ప్రవేశించినప్పటి నుంచి సభా ప్రాంగణం వరకు అడుగడుగునా తమ అభిమాన నేతకు జనం ఘన స్వాగతం పలికారు. 46 డిగ్రీల ఎండలోనూ సీఎం వైఎస్ జగన్ నన్న ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు పెదారికట్ల, చినారికట్ల, జంక్షన్, సిద్ధవరం, మూగచింతల, కొనక నమిట్ల, నాగరాజుకుంట, సలకనూతల, మాదిరెడ్డిపాలెం బస్టాండ్ సెంటర్లో పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. సభా ప్రాంగణం పరిసరాలు ‘జై జగన్, మేమంతా ‘సిద్ధం’ నినాదాలతో మారుమోగాయి.
సీఎం వైఎస్ జగన్ కు స్వాగతం పలికిన నాయకులు
దర్శి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపల్లిలో సిఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లైటింగ్ మరియు ప్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
దర్శి మండలం రాజంపల్లి ఎస్సీకాలనీ వద్ద పూలు చల్లుతూ సీఎం వైఎస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. గడియార స్తంభం సెంటర్లో భవనాలు, టవర్లు, స్తంభాలపైకి ఎక్కి జగనన్నకు అభివాదం చేశారు. అనంతరం సిఎం దర్శి మండలంలోని వెంకటాచలంపల్లి వద్ద రాత్రికి బసచేసే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేశారు. సీఎం వైయస్ జగన్ కు స్వాగతం పలకడానికి దర్శి నియోజకవర్గం లోని దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని ప్రజా ప్రతినిధులు ,నాయకులు, పార్టీ బాధ్యతల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారు.












