దర్శి అసెంబ్లీకి ఇరువురు డాక్టర్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. దర్శి అసెంబ్లీ చరిత్రలో ప్రప్రథమంగా రెండు ప్రధాన పార్టీల నుంచి డాక్టర్లు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభ్యర్దిత్వం ఖరారు కావటంతో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మన మరాలు డాక్టర్ లక్ష్మీని పార్టీ ఖరారు చేసింది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఇరువురు డాక్టర్లు పోటీ పడుతున్నారు. ఇరు కుటుంబాలకు సుదీర్ఘ రాజ కీయ చరిత్ర ఉంది.
డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి 2004లో దర్శి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. డాక్టర్ శివప్రసాద్ రెడ్డి 2006లో చీమకుర్తి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో దర్శి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మ కొంతకాలం చీమకుర్తి ఎంపీపీగా పనిచేశారు. గత స్థానిక సంస్థల ఎన్ని కల్లో వెంకాయమ్మ దర్శి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం ఆమె జడ్పీ చైర్పర్సన్ గా ఎంపికై ఆ పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా డాక్టర్ శివప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సిపి టికెట్ ఇవ్వ టంతో ప్రచారం చేస్తున్నారు.
గొట్టిపాటి లక్ష్మి తాత గొట్టిపాటి హనుమంత రావు గతంలో అనేకసార్లు మార్టూరు ఎమ్మెల్యేగా, జడ్పీచైర్మన్ గా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఆమె తండ్రి గొట్టిపాటి నరసింహారావు (నర్సయ్య) మార్టూరు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. ఆమె బాబాయి గొట్టిపాటి రవికుమార్ తొలుత మార్టూరు ఎమ్మెల్యేగా అనం తరం మూడుసార్లు అద్దంకి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అద్దకి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి గొట్టిపాటి లక్ష్మీ… యలమందల గ్రామానికి చెందిన డాక్టర్ కడియాల లలితసాగర్ వివాహం జరిగింది. అక్కడ వారిది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అక్కడ లక్ష్మీ మామ కడియాల వెంక టేశ్వరరావు రాజకీయంగా ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.
ఆమె చిన్నమామ రమేష్ పలు దఫాలుగా ఏఎంసీ చైర్మన్ గా పదవులు నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ అనుచరులుగా గుర్తింపు ఉంది. డాక్టర్ లక్ష్మీ, ఆమె భర్త లలితసాగర్, మామ వెంకటేశ్వరరావులు నర్సరావుపేటలో ప్రముఖ వైద్యులు. వైద్యశాల నిర్వహిస్తూ రోగులకు సేవలందిస్తున్నారు. ఇరువురు అభ్యర్థులకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో పాటు సామాజిక బలం కూడా పుష్కలంగా ఉంది. ఈనేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
