సికింద్రాబాద్ కోచింగ్ డిపోకు సంబందించి వాషింగ్ లైన్‌లో గురువారం ఉదయం సుమారు గం 10.30 లకు మెయింటెనెన్స్ కోసం నిలచియున్న ప్యాంట్రీ కార్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. కోచ్ మెయింటెనెన్స్ సిబ్బంది కోచ్ నుండి పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సంబందిత అధికారికి సమాచారం అందించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక అధికారులకు కూడా సమాచారం అందజేయడం జరిగింది.
స్టేషన్‌లోని రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేశారు. అదే సమయంలో, మంటలు ఇతర కోచ్ లకు వ్యాపించకుండా అగ్నికి గురైన కోచ్ ను ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఇతర కోచ్ల నుండి వేరుచేసారు . ఉదయం 11.30 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ వాషింగ్ లైన్‌లో అగ్నికి గురైన ప్యాంట్రీ కార్ కోచ్ ను సందర్శించారు. తదుపరి అగ్నిప్రమాద సంఘటనకు సంబందించిన అంశాలపై సమీక్షించి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ జరిగిన సంఘటనపై జనరల్ మేనేజర్ కు వివరించారు.

