దేశ సరిహద్దులలో రక్షణ విధులు నిర్వర్తిస్తూ అనుక్షణం దేశ ప్రజల ప్రాణాలను కాపాడే సైనికులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసిపి జి శంకర్ రాజ్ అన్నారు. శుక్రవారం బొల్లారం మద్రాస్ ఆర్మీ బెటాలియన్ సిబ్బందికి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ దేశ సరిహద్దులలో రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సైనికులు వాహనాలపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు బాధ్యత అని ఆయన వారికి వివరించారు. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ 5000ల జరిమానాతో పాటు మూడు నెలల వరకు జైలు శిక్షణ విధిస్తారని అన్నారు. అలాగే రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని, సిగ్నల్ జంప్ చేయరాదని, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ను తప్పక ధరించాలని ఆయన వారికి సూచించారు .ఈ సందర్భంగా ఆర్మీ సైనికులు అడిగిన పలు సందేహాలను ఏసిపి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కల్నల్ అభిషేక్ సింగ్ 200 మంది ఆర్మీ జవాన్లు,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


