మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే వారికి ఉచిత ప్రభుత్వ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ” స్త్రీ శక్తి ” పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. శుక్రవారం ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఒంగోలు బస్టాండ్ లో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. విజయవాడ బస్టాండులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి
కె. పవన్ కళ్యాణ్,
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించగా, దానికి అనుబంధంగా ఒంగోలులోని బస్టాండులో ఏర్పాటుచేసిన పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీరు వీక్షించారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వామితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఒడా చైర్మన్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ వైద్యురాలు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు చెప్పారు. అధిక మొత్తంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు, దీపం – 2, డిఎస్సీ పరీక్షల నిర్వహణ, ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకాలను ఇప్పటికే అమలు చేశామన్నారు. తాజాగా ప్రభుత్వ బస్సులలోనూ
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి చేస్తున్నామన్నారు. పల్లె వెలుగు , అల్ట్రా పల్లె వెలుగు , సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్,
ఎక్స్ ప్రెస్ బస్సులలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. మన జిల్లా మహిళలు కేవలం మన జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఈ వెసులుబాటు ఉపయోగించుకోవచ్చు అన్నారు. ప్రకాశం జిల్లాలో ఐదు ప్రజా రవాణా డిపోలు ఉండగా మొత్తం 485 బస్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా ప్రతిరోజూ 1.50 లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద వీటిలో 326 బస్సులను ( పల్లె వెలుగు – 248, అల్ట్రా పల్లె వెలుగు – 4, ఎక్స్ ప్రెస్ – 74 ) కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సుల ద్వారా 1.20 లక్షల మంది మహిళలకు లబ్ది కలుగుతుందని వివరించారు. జిల్లాలోని 13 లక్షల మంది మహిళలూ
ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేసే ఇళ్ల స్థలాలను కూడా మహిళల పేరుతోనే పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. రైతులకు కూడా త్వరలోనే పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళా సాధికారతకు, ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి పునరుద్ఘాటించారు.
స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ …ఉచిత బస్సు ప్రయాణం వలన ప్రతి మహిళకు నెలకు రూ.1500 నుంచి 2000 రూపాయల వరకూ ఆదా అవుతుందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ 14 నెలల్లోనే ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామన్నారు.
డ్రైవర్ దామచర్ల…!!
మహిళల కోసం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంచిన బస్సులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి స్వామి, ఎంపీ, కలెక్టర్ జెండా ఊపగా…. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు డ్రైవర్ పాత్ర పోషించారు. మహిళలతో పాటు ప్రజా ప్రతినిధులను ఎక్స్ ప్రెస్ బస్సులో ఎక్కించుకొని నడిపి ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జి. సత్యనారాయణ, డిపో మేనేజర్ జి.శ్రీనివాస్, సూపరింటెండెంట్ బి.ఫణి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






