బేగంపేట ,ఏప్రిల్ 28, (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల అంతర్గత నాణ్యత హామీ విభాగం (IQAC) రజతోత్సవ వేడుకల సందర్భంగా ‘కంప్లయన్స్ నుండి ఎక్సలెన్స్ వరకు: నాణ్యతా ప్రయాణంపై పునరాలోచన’ అనే అంశంపై మంగళవారం జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీని తట్టుకోవాలంటే విద్యావేత్తలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని, లేదంటే కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. వికసిత భారత్, రైజింగ్ తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక సంస్కరణలు, నైపుణ్యాధారిత విద్య అవసరమని ఆయన పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి. ఉమా జోసెఫ్ మాట్లాడుతూ.. 1959లో కేవలం 15 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 3,500 మంది విద్యార్థులతో నాణ్యమైన విద్యను అందిస్తోందని తెలిపారు. ఐక్యూఏసీ గత 25 ఏళ్లుగా అకడమిక్, పరిశోధన రంగాల్లో సాధించిన మైలురాళ్లను వివరిస్తూ మాజీ కోఆర్డినేటర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. గౌరవ అతిథిగా హాజరైన జేవియర్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సిస్టర్ దీప్తి మాట్లాడుతూ.. కృత్రిమ మేధ (AI) సమ్మిళిత అభ్యాసం నేటి అవసరమని,ఉపాధ్యాయుల్లో వచ్చే మార్పులే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని అన్నారు.
సదస్సులో భాగంగా ఐటీ నిపుణుడు పంకజ్ భగత్ ‘ఉన్నత విద్యలో ఏఐ సాధనాలు’ అనే అంశంపై మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాల కోసం వెతకడం మానేసి, ఏఐని వినియోగిస్తూ సృజనకర్తలుగా మారాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎ. పాట్రిక్ గ్రామీణ విద్య, మాతృభాషలో బోధన మరియు సమ్మిళిత విద్య ప్రాధాన్యతను వివరించారు. అనంతరం జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొని అంతర్జాతీయ ప్రమాణాల గురించి చర్చించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల ఉత్తమ విధానాలతో రూపొందించిన సెమినార్ సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. ఈ మేధోమథనం ఉన్నత విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎంతో దోహదపడుతుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఉమా జోసెఫ్ ముగించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Chief Guest Prof. V. Balakista Reddy, Chairman, TGCHE, addressing the gathering during the seminar.

Principal Prof. T. Uma Joseph delivering a session on “Experiential Learning and Best Practices.”

College management felicitating Chief Guest Prof. V. Balakista Reddy at the event.

Release of the IQAC Souvenir during the Silver Jubilee National Seminar.

Students inaugural dance performance at the IQAC National Seminar.