‘ స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు -అందుకోసమే పల్లెనిద్ర -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

 ‘ స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అందుకోసమే పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా జిల్లా యంత్రాంగం మొత్తం మీ మధ్యకు వస్తున్నది. ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకుంటాం. మీ గ్రామంలోని త్రాగునీటి సమస్య పరిష్కారానికి సత్వరమే రూ.30 లక్షలతో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ఆర్థికేతర సమస్యలపై అధికారులు తక్షణమే దృష్టి సారిస్తారు. ఆర్థికపరమైన సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ‘… అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

                 గురువారం ఆయన మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారితో కలిసి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. స్థానికుల మంచి అర్జీలను స్వీకరించారు.

              ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ………గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ మనమిత్ర ‘ వాట్సప్ సేవలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ‘ కౌశలం ‘, విపత్తుల సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే ‘ అవేర్ 2.0 ‘ ఆన్లైన్ పోర్టల్ గురించి స్వయంగా కలెక్టరే ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని గర్భిణులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం.ల ద్వారా లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలని, పోషకాహారం తీసుకుంటూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, వైద్యుల ద్వారా పొందుతున్న సేవలపై గర్భిణులు సంతృప్తి వ్యక్తం చేశారు.

               స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 1300 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. గుండ్లకమ్మ నుంచి వెళ్తున్న పైప్ లైన్ నుంచి తమ గ్రామానికి కనెక్షన్ కావాలని కోరారు. అదేవిధంగా తమ గ్రామంలోని చెరువుకు కూడా నీటిని మళ్ళించాలని అభ్యర్థించారు. గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. దళిత, గిరిజన కాలనీలకు శాశ్వత స్మశాన వాటిక కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ గ్రామం నుంచి ఒంగోలుకు పండ్ల వ్యాపారం నిమిత్తం వెళ్తున్న రైతులకు మార్కెట్ వద్ద వసతులు కల్పించాలని స్థానికులు అభ్యర్థించారు. తమకు మత్స్యకార లైసెన్సులు ఇప్పించాలని పల్లెకారులు విజ్ఞప్తి చేశారు.

                 గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలను కలెక్టర్ ఓపికతో విన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ సందర్భంగా రూ.6.50 కోట్ల విలువైన బ్యాంకు చెక్కును కలెక్టర్, ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ అందించారు. ఈ రుణాలను మెరుగైన జీవనోపాధికి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

రూ.3 కోట్లతో రోడ్డు

        ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ……… జిల్లా యంత్రాంగం మొత్తం ప్రజల వద్దకు రావడం హర్షనీయమన్నారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వ్యక్తిగతంగా తాను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఏడుగుండ్లపాడు – ఇనమనమెల్లూరు రోడ్డును రూ.3 కోట్లతో నిర్మించేందుకు కలెక్టర్ హామీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల పనులను డిసెంబర్ నుంచి చేపడతామన్నారు.

               ఈ కార్యక్రమంలో జెడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య చైర్మన్ జయంతి బాబు, తదితరులు పాల్గొన్నారు.

          దీనికి ముందుగా మండలంలోని అన్ని గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎస్సీ కాలనీలో పర్యటన

                  పల్లెనిద్ర కార్యక్రమానికి ముందుగా స్థానిక ఎస్సీ కాలనీలో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటించి ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వి.బి.జి. రామ్ జీ పథకం కింద లభిస్తున్న ఉపాధి అవకాశాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కింద అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలపై కలెక్టర్ ఆరా తీశారు. పిల్లలను పాఠశాలకు పంపుతున్న తీరు, డ్రాపౌట్స్ గురించి మాట్లాడారు. గ్రామంలోని స్కూల్ కు ప్రహరీ గోడ కావాలని, టీచర్లను పూర్తిస్థాయిలో నియమించాలని స్థానికులు కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తాము తీసుకునే రుణాలను జీవనోపాధి పెంచుకునేందుకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. స్థానికులకు ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *