ఇళ్ల వద్దే ఓటర్ల విచారణసికింద్రాబాద్‌లో ముమ్మరంగా ‘సర్‌’ సర్వే-నవంబర్‌ 5 నాటికి ప్రక్రియ పూర్తి -ఈఆర్‌వో జ్యోతి

సికింద్రాబాద్ అక్టోబర్ 4(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నారు. 70–సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్‌‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు) విస్తృతంగా పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌వో), డిప్యూటీ కమిషనర్‌‌ ఎం.ఎన్‌.ఆర్‌. జ్యోతి తెలిపారు. విచారణ కేంద్రాలకు రాలేని వారి కోసం బీఎల్‌వోలే స్వయంగా వారి నివాసాలకు వెళ్లి ధ్రువీకరణ పూర్తి చేస్తున్నారు. అవసరమైన పత్రాలు తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌‌లోడ్‌ చేసేందుకు సైతం ఓటర్లకు తోడ్పాటు అందిస్తున్నారు.
ముఖ్యంగా జాబితాలో ఒకే పేరుతో ఉన్న డూప్లికేట్‌ ఎంట్రీలు, మరణించిన వారు, నివాసాలు మారిన వారి వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,68,951 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,66,241 మందిని క్షేత్రస్థాయి ధ్రువీకరణ కోసం గుర్తించారు. ఇందులో డూప్లికేట్, మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన కేసులు 1,02,710గా తేలాయి. ఇప్పటివరకు 87,787 మందికి నోటీసులు జారీ చేయగా, ఇప్పటికే 78,677 మంది ఓటర్ల విచారణ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన 9,090 కేసులను మరింత లోతుగా ధ్రువీకరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, అపార్ట్‌‌మెంట్‌ సొసైటీలు, స్థానిక సంస్థల ప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. నిర్దేశిత గడువు ప్రకారం నవంబర్‌ 5వ తేదీ నాటికి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఈఆర్‌వో తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు, వ్యత్యాసాలు లేకుండా పకడ్బందీ జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యంగా సిబ్బంది శ్రమిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *