క్రెడిట్ కార్డు పేరుతో సైబర్‌మోసం– మహిళ ఖాతా నుంచి రూ.1.30 లక్షలు స్వాహా

బేగంపేట అక్టోబర్ 6, ( జె ఎస్ డి ఎం న్యూస్) :
సరికొత్త క్రెడిట్‌కార్డు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి ఓ మహిళ ఖాతా నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.1,29,998 కాజేసిన ఘటన రాంగోపాల్‌పేట్‌పరిధిలో వెలుగుచూసింది. సింధీ కాలనీకి చెందిన గృహిణి అంజలి మట్టా (57)కు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి (ఫోన్ నం. 6289473037) నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తాను హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌కార్డు విభాగం ప్రతినిధినని పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి, ఆమెకు కొత్త క్రెడిట్ కార్డు ఇప్పిస్తానని నమ్మబలికాడు. తనకు కార్డు అవసరం లేదని ఆమె స్పష్టం చేసినప్పటికీ, మాటల్లో పెట్టి సంభాషణను కొనసాగించాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే బాధితురాలి ఫోన్‌కు సంబంధించిన కాల్స్ అన్నీ మరో నంబర్‌కు (9101868875) ఫార్వర్డ్ అయినట్లు మేసేజ్‌రావడంతో పాటు, ఎస్‌ఎంఎస్‌సర్వీస్ సైతం నిలిచిపోయింది. అనుమానం వచ్చిన ఆమె వెంటనే క్రెడిట్‌కార్డు కస్టమర్‌కేర్‌కు ఫోన్‌చేసి తన కార్డును బ్లాక్‌చేయించింది. అయితే, అప్పటికే ఆమెకు తెలియకుండానే మొబైల్‌లోకి ‘హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌కార్డు’ పేరుతో అనుమానాస్పద ఏపీకే (APK) ఫైల్ ఇన్‌స్టాల్ అయినట్లు బాధితురాలు గుర్తించింది.
అనంతరం ఆమె ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు లావాదేవీలకు యత్నించగా, రెండు విఫలమయ్యాయి. మరో రెండు లావాదేవీల్లో జెప్టో మార్కెట్‌ప్లేస్‌కు రూ.89,998, ఫేస్‌బుక్‌ఇండియాకు రూ.40,000 చొప్పున మొత్తం రూ.1,29,998 నగదు బదిలీ అయినట్లు తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌సైబర్‌క్రైమ్‌పోలీసులు ఐటీ చట్టం, బీఎన్‌ఎస్‌సెక్షన్ల కింద జీరో ఎఫ్‌ఐఆర్‌నమోదు చేసి, కేసును తదుపరి విచారణ నిమిత్తం సికింద్రాబాద్‌22వ అదనపు చీఫ్‌జ్యుడీషియల్‌మేజిస్ట్రేట్‌న్యాయస్థానానికి సమర్పించారు. బాధితురాలికి న్యాయం చేసి, కాజేసిన సొమ్మును రికవరీ చేసేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *