హైదరాబాద్ అక్టోబర్ 8(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు రావణ దహనం కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఘనంగా నిర్వహించుకోవాలని గోల్కొండ జోన్ డీసీపీ రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. కుల్సుంపురా డివిజన్ పరిధిలోని దుర్గామాత విగ్రహాల నిర్వాహకులు, స్థానిక నాయకులు, శాంతి కమిటీ సభ్యులతో అయన గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుల్సుంపురా ఏసీపీ తిరుపతి, డివిజన్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలతో పాటు వంద మందికి పైగా ఉత్సవనిర్వాహకులు, శాంతి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ పండుగల వేళ శాంతిభద్రతల పరిరక్షణకు ఉత్సవ నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. మండపాల ఏర్పాటు, మైక్ సెట్లు, డీజేల వినియోగంలో పోలీసునిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి మండపం వద్ద నిర్వాహకులు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బతుకమ్మ, దుర్గామాత విగ్రహాల నిమజ్జనఊరేగింపుల సమయాలను పాటిస్తూ, కేవలం ముందస్తు అనుమతి పొందిన మార్గాల్లోనే వెళ్లాలనిసూచించారు. రావణ దహనం నిర్వహించే ప్రాంతాల్లో తగినంత స్థలం ఉండేలా చూసుకోవడంతో పాటు అగ్నిమాపక, విద్యుత్ భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని హెచ్చరించారు. ప్రజలందరూ సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలని, ఏవైనా సమస్యలు లేదాఅనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: