సికింద్రాబాద్, అక్టోబర్ 12, (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు సత్యనారాయణ (40) దుర్మరణం చెందారు. నిన్న రాత్రి బతుకమ్మ వేడుకల ప్రదర్శన ముగించుకుని హకీంపేట నుంచి హయత్నగర్ వైపు తన కారులో తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఆయన కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఊహించని ఈ పరిణామంతో కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సత్యనారాయణకు అధిక రక్తస్రావమైంది. ప్రమాదం జరిగిన సమయంలో గమనించే వారు ఎవరూ లేకపోవడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది అర్ధరాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన సత్యనారాయణను బయటకు తీసి పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. విదేశాల్లో ఉంటున్న ఆయన సోదరుడు నగరానికి చేరుకోవాల్సి ఉండటంతో, అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. గత 15 ఏళ్లుగా మిమిక్రీ, మ్యాజిక్ రంగాల్లో 2 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విశేష ఆదరణ, ఎన్నో అవార్డులు అందుకున్న ప్రతిభావంతుడైన కళాకారుడు సత్యనారాయణ అకాల మరణం పట్ల తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల వేణుతో పాటు కళాకారుల సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip: