ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి -క్లీన్ ఎనర్జీ రంగంలో సౌదీ అరేబియాలాగా ఏపీని తీర్చిదిద్దుతాం-పరిశ్రమలకు విధానపరమైన స్థిరత్వం ఎంతో అవసరం -ఇంధన రంగంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సెషన్ లో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం: ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని, క్లీన్ ఎనర్జీ రంగంలో సౌదీ అరేబియాలాగా ఏపీని తీర్చిదిద్దుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘భారతదేశ ఇంధన భవిష్యత్ కు ఊతమివ్వడం: పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్’ (Powering Indis’s Energy Future: Renewables and Green Hydrogen) అంశంపై జరిగిన ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా ఈటీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ శ్రీమతి నిధి శర్మ వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్లీన్ ఎనర్జీలో రంగంలో ఆంధ్రప్రదేశ్ ను సౌదీ అరేబియాలాగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. పవన విద్యుత్, సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా, ఆ విద్యుత్‌ను గ్రీన్ మాలిక్యూల్స్‌ రూపంలోకి మార్చి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడంతో పాటు, దేశీయంగా మన ఇంధన అవసరాలను కూడా తీర్చగలగాలి. దేశం కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని నేను కోరుకుంటున్నాన ని అన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గ్రీన్ మాలిక్యూల్స్ కీలక పాత్ర

సీఎం చంద్రబాబు కూడా ఈరోజు చేసిన ప్రసంగంలో మన ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించడం చాలా ముఖ్యం. ఈ లక్ష్య సాధనలో గ్రీన్ మాలిక్యూల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశంపై జరుగుతున్న చర్చ ఇంధన ఉత్పత్తి నుంచి వినియోగం వరకు అన్ని దశలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇప్పటికే సౌర విద్యుత్, పవన విద్యుత్, ఇంధన నిల్వ వ్యవస్థలపై పనిచేస్తున్నాం. అదే సమయంలో గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సాధించిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ఈ మొత్తం ప్రక్రియను సమగ్రంగా పరిశీలించాలి. తద్వారా ఈ ప్రయాణంలో భారత్ వేగంగా ముందుకు వెళ్లేందుకు వీలవుతుంది.

పెరిగే విద్యుత్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా..

గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం దాదాపు 30 శాతం పెరిగింది. వాస్తవానికి, ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తున్న అవగాహన ఒప్పందాలు, ప్రారంభం కానున్న వాణిజ్య ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకోకముందే ఈ పెరుగుదల నమోదైంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు డేటా సెంటర్లు కూడా రాష్ట్రంలో ఏర్పాటు కావడం మనం చూస్తున్నాం. దీంతో 2028 నాటికి మన విద్యుత్ అవసరాలు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సంప్రదాయ ఇంధన వనరుల ద్వారా కొంత మేర బేస్‌లోడ్ విద్యుత్ అవసరాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు సహజ వనరుల పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. మనకు పవన విద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రాంతాలు ఉన్నాయి. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సూర్యరశ్మి సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి సౌర విద్యుత్ విషయంలో మనకు పెద్దగా సమస్య లేదు.

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాం

అయితే ఇక్కడ ప్రధాన సవాలు ప్రాజెక్టులను ఎంత వేగంగా పూర్తి చేయగలమన్నదే. ఎందుకంటే మరో రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో మన విద్యుత్ అవసరాలు కనీసం రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన సంస్థల ముందున్న సవాల్.. పోటీ ధరలకు నిరంతరాయంగా గ్రీన్ ఎనర్జీని ఎలా అందించగలమన్నది. పగటిపూట సౌర విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గి యూనిట్‌కు 50 పైసల స్థాయికి చేరుకున్నాయి. అయితే రాత్రి వేళల్లో ధరలు మళ్లీ యూనిట్‌కు రూ.10కి చేరుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరల పరిమితిని తొలగిస్తే, యూనిట్ ధర రూ.30కి కూడా చేరవచ్చు. కాబట్టి నిరంతరాయంగా అందుబాటులో ఉండే గ్రీన్ ఎనర్జీని పోటీ ధరలకు ఎలా అందించాలన్నదే మన ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తితో ముందుకు సాగుతోంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై కూడా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. అయితే ఈ ప్రాజెక్టులను చాలా వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇతర జలవిద్యుత్ ప్రాజెక్టుల మాదిరిగా సంప్రదాయ పద్ధతుల్లో ఐదు నుంచి ఏడు సంవత్సరాల సమయం తీసుకునే విధానాన్ని ఇక్కడ అనుసరించలేం. ఎందుకంటే పెట్టుబడి వ్యయం చాలా ఎక్కువ. ఈరోజు ప్రాజెక్టును నిర్మించకపోతే, మరో మూడు సంవత్సరాల తర్వాత అదే ప్రాజెక్టు నిర్మాణానికి రెట్టింపు ఖర్చు చేయాల్సి రావచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన అమలుకు ప్రాధాన్యత ఇస్తోంది.

పరిశ్రమలకు విధానపరమైన స్థిరత్వం అవసరం

2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ విధానపరమైన స్థిరత్వం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే 2024 తర్వాత మేం తీసుకున్న ప్రధాన చర్య.. పరిశ్రమలకు విధానపరమైన స్థిరత్వాన్ని కల్పించడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాం. పరిశ్రమలతో ఉన్న సమస్యలను పరిష్కరించి, కొత్త ఆరంభానికి మార్గం సుగమం చేశాం. దీని ఫలితంగా గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో దాదాపు 4.8 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అదనంగా చేర్చగలిగాం. అదే 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో కేవలం 6 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అదనంగా చేరింది. సౌర విద్యుత్, పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ వంటి ప్రాజెక్టులన్నీ దీర్ఘకాలిక పెట్టుబడులతో కూడుకున్నవి. కాబట్టి పరిశ్రమలకు విధానపరమైన స్థిరత్వం ఎంతో అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా కీలకమైన పాత్ర ఉంది.

స‌ముద్రంలోకి ఏటా 3వేల టీఎంసీల గోదావ‌రి నీరు

ప్రతి సంవత్సరం గోదావరి నది నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలుస్తోంది. 3,000 టీఎంసీల నీరు అంటే.. బ్రెజిల్ దేశం ఒక ఏడాదిలో వినియోగించే నీటి పరిమాణానికి ఇది దాదాపు సమానం. ఏపీలో పోలవరం ప్రాజెక్టుతో ఈ నీటిని నిల్వ చేసి, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలు, గృహావసరాల కోసం వినియోగంలోకి తీసుకువస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న ప్రాజెక్టులను పరిశీలిస్తే.. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇది ఎయిర్ కూల్డ్ డేటా సెంటర్. అంటే నీటిని ఉపయోగించి చల్లబరిచే విధానం కాకుండా, గాలి ద్వారా శీతలీకరణ చేసే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుకు పునరుత్పాదక ఇంధనం ఆధారంగా విద్యుత్ అందిస్తారు. మనం బొగ్గు ఆధారిత విద్యుత్ నుంచి స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు మార్పు గురించి మాట్లాడుతున్నాం. అయితే ఒక గిగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ కేంద్రం.. అదే పరిమాణంలో విద్యుత్ వినియోగించే డేటా సెంటర్‌తో పోలిస్తే దాదాపు పది రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది. కానీ ఈ అంశంపై ఎవరూ పెద్దగా చర్చించడం లేదు. అందుకే ఈ గణాంకాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు ప్రజాప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.

డేటా సెంటర్లపై అపోహ‌లు వ‌ద్దు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ల విషయంలో కనీసం 80 శాతం విద్యుత్ అవసరాలను గ్రీన్ ఎనర్జీ ద్వారా తీర్చాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా, అవన్నీ ఎయిర్ కూల్డ్ విధానంలోనే పనిచేయనున్నాయి. కాబట్టి డేటా సెంటర్లపై యువతలో ఉన్న అపోహలు, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో యువత తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తుండటం మంచి పరిణామం. అయితే వారు ఉపయోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు కూడా డేటా సెంటర్లపైనే ఆధారపడి పనిచేస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో డేటా సెంటర్లు చాలా కీలకమైనవి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన డేటా, మన పౌరుల వ్యక్తిగత డేటా మన దేశ భూభాగంలోనే భద్రపరచటం ఎంతో ముఖ్యం.

పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తున్నాం

పారిశ్రామికవేత్తలను నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఆ పరిష్కారం ఒక కంపెనీకి లేదా ఒక ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా, ఆ సమస్యకు పరిష్కారం చూపే విధానాన్ని ఒక వ్యవస్థగా రూపొందిస్తున్నాం. ఇదే మా ప్రభుత్వ విధానం. ఈ విధానం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంలో గణనీయమైన పురోగతి సాధించాం. రాబోయే ఆరు నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా..

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేం హామీ ఇచ్చాం. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల ఉద్యోగాలను కల్పించగలిగాం. వ్యవసాయం నుంచి సిమెంట్ పరిశ్రమ వరకు, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల వరకు వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతోంది. ఇప్పుడు మా లక్ష్యం రాష్ట్రంలో గుర్తించిన 25 పారిశ్రామిక క్లస్టర్లు వాటి పూర్తి సామర్థ్యంతో అభివృద్ధి చెందేలా చూడటం. ఇదే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం. మన రాష్ట్రంలో విద్యుత్ ధర ఇతర సమాన స్థాయి రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడంతో పెట్టుబడుల ఆకర్షణలో ముందున్నాం. భవిష్యత్తులో విద్యుత్ టారిఫ్ లను మరింత తగ్గిస్తామని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మినరల్స్ హెడ్ రాబర్డో బోకా, ఏసీఎంఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో నిఖిల్ ధింగ్రా, రిసాల్వెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ శర్మ, సుజ్లాన్ కార్పోరేట్ అఫైర్స్ అండ్ రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ దినేష్ జగ్దాలే, క్లీన్ మ్యాక్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కుల్దీప్ జైన్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *