మహిళా బిల్లుపై బిజెపి రాజకీయ కుట్రరాష్ట్ర క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్,సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అడక్షుడు దీపక్ జాన్.

సికింద్రాబాద్, ఏప్రిల్ 19 , ( జే ఎస్ డి ఎం న్యూస్) :
మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాలపునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ముడిపెట్టడం వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి స్పష్టమైన రాజకీయ అజెండా ఉందని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలనే నిజమైన సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పార్లమెంట్ స్థానాల పెంపు పేరుతో డీలిమిటేషన్‌ను సాకుగా చూపుతూ, ఈ బిల్లును ఏళ్ల తరబడి ఆలస్యం చేయాలనే దురుద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. బయటకు మహిళా సాధికారతపై గొప్పలుచెప్పుకుంటున్నప్పటికీ, ఆచరణలో మాత్రం కేంద్రం అడుగు ముందుకు వేయడం లేదని విమర్శించారు.
డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం కలిగించేలా కేంద్రం కుట్ర పన్నుతోందని దీపక్ జాన్ ఆరోపించారు. జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాలకు ఇది కోలుకోలేని అన్యాయమని, ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సమగ్ర అభివృద్ధిని దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి వివక్షాపూరిత విధానాలను సహించేది లేదన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళలను, ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నంగా బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులై ఉన్నారని, బీజేపీ పన్నుతున్న రాజకీయ కుట్రలను తిప్పికొట్టే శక్తి ప్రజలకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతికే తగిన గౌరవం ఇవ్వని కేంద్ర ప్రభుత్వం, సాధారణ మహిళల హక్కులను ఏ విధంగా కాపాడుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల అంశంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని అందుకే ఇండియా కూటమి గట్టిగా
వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. మహిళలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే, డీలిమిటేషన్ అనే అడ్డంకిని తొలగించి బిల్లును వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *