ఆందోళనకరంగా పొగాకు వేలం -ఇలాగే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు -పొగాకు సమస్య పై 18న ఆచార్య రంగా భవన్‌లో పొగాకు రైతు సదస్సు

పొగాకు వేలాల నిర్వహణ తీరు అత్యంత ఆందోళనకరంగా మారిందని, ఇదే పరిస్థితి కొనసాగితే పొగాకు రైతుల ఆత్మహత్యలు తప్పవని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. వర్జినియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్య పై ఈ నెల 18 పొగాకు రైతు సదస్సు నిర్వహించనున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు మాట్లాడుతూ వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చే పొగాకు రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పొగాకు బోర్డు తన లక్ష్యాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది కనీసం 4 మిలియన్ కిలోల పొగాకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వేలం కేంద్రాల్లో ప్రివారికేటర్లు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వీరిని అదుపు చేయకపోతే బోర్డు ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. రైతులను రక్షించేందుకు ప్రభుత్వమే నేరుగా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జుజ్జూరి జయంతిబాబు మాట్లాడుతూ గత నెల 9న ప్రారంభమైన పొగాకు వేలం ప్రక్రియ రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రారంభంలో 25 శాతంగా ఉన్న ‘నో బిడ్’ పరిస్థితి ప్రస్తుతం 70 శాతానికి చేరిందని తెలిపారు. గత ఏడాది లో గ్రేడ్ పొగాకు కొనుగోలు కాక బేరన్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది అది రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ సంక్షోభంపై చర్చించేందుకు ఈ నెల 18న ఆచార్య రంగా భవన్‌లో పొగాకు రైతు సదస్సు నిర్వహిస్తున్నామని, రైతులు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కె.హనుమారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పొగాకు ధరలు పతనమవుతున్నా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడం లేదని విమర్శించారు. గత సంవత్సరం వేలం కేంద్రాలను సందర్శించి హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు ఈ ఏడాది అటువైపు కూడా చూడలేదన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తక్షణమే పొగాకు కొనుగోలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రైతు కూలి సంఘ జిల్లా నాయకురాలు లలితకుమారి మాట్లాడుతూ శనగ, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు లేక తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు పొగాకు సాగు చేశారని తెలిపారు. అలాంటి రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. ప్రకాశం జిల్లాలోని కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సమాఖ్యల ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు పమిడి వెంకటరావు మాట్లాడుతూ ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభమైన వేలం ప్రక్రియ రైతులను “కొనుగోలు చేస్తే చాలు” అన్న దయనీయ స్థితికి నెట్టేసిందన్నారు. రైతులు తమ నష్టాలను కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే పొగాకు రైతుల ఆత్మహత్యలు మళ్లీ పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పొగాకు బోర్డుకు రూ.500 కోట్లు కేటాయించి పంట కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు.సమావేశంలో రైతు సంఘ నాయకులు పరిటాల కోటేశ్వరరావు, టి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *