ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అద్దంకి నియోజక వర్గం, సంతమాగులూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన నియోజక వర్గ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లతో కలిసి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించడంతో పాటు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ సంధర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమమునకు సంబంధించి జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజికవర్గములో ప్రతి శుక్రవారం రోజు ” 1 నియోజకవర్గము, 4 పర్యటనలు” కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు అద్దంకి నియోజక వర్గ పరిధిలోని సంతమాగులూరు మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ రోజు వచ్చిన అర్జీలలో ఎక్కువ భాగం రెవెన్యూ సమస్యలపై మరియు కొత్త పెన్షన్లు మంజూరు కు సంబంధించి రావడం జరిగిందని, ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్క అద్దంకి నియోజక వర్గంలో సుమారు మూడు వేల మందికి 25 కోట్ల రూపాయలు మేర సిఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అంద చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇటీవల 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో సన్మానించడం జరిగిందన్నారు. సిఎస్ఆర్ నిధులతో నియోజక వర్గంలో 20 కమ్యూనిటీ హాల్స్ నిర్మించడం జరిగిందని, మరో 12 కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. నాగార్జున సాగర్ కెనాల్ కు నీటిని వదలకు ముందే అన్నీ కాలువల్లో పూడికతీత, క్లియరెన్స్ పనులు చేపట్టడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సర కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
నేడు ప్రపంచంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో సోలార్ విద్యుత్ ను మరింత ప్రోత్సహిస్తూ సూర్య ఘర్ పథకం కింద రాయితీతో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ రోజు వచ్చిన అర్జీల్లో ఎక్కువ శాతం పెన్షన్ల పై రావడం జరిగిందని, కొత్త పెన్షన్ల మంజూరుకు ముఖ్యమంత్రి గారు త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా అలాగే ఆన్ లైన్ ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరుగుచున్నదన్నారు. ఆర్జీలను స్వీకరించడంతో పాటు సంబంధిత అర్జీదారులు సంతృప్తి స్థాయి పెరిగేలా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుచున్నదన్నారు. అయినప్పటికినీ మరింతగా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా ప్రతి శుక్రవారం ఒక నియోజక వర్గం, నాలుగు పర్యటనలు అనే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద ఒక నియోజక వర్గంలో నాలుగు సార్లు పర్యటించి వచ్చిన సమస్యలపై దృష్టి సారించినట్లయితే ఆ సమస్యలు పరిష్కరించబడునన్న ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ కార్యక్రమం కింద వచ్చిన అర్జీ వంద శాతం పరిష్కారం కావాలి అనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సుమారు 204 అర్జీలు రావడం జరిగిందని, అందులో 68 అర్జీలు రెవెన్యూ సమస్యలపై, మరో 44 అర్జీలు పెన్షన్లు కోసం రావడం జరిగిందన్నారు. ఫైనాన్స్ కు సంబంధం లేని రెవెన్యూ సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించడంతో పాటు పరిష్కారం అయినట్లుగా లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఏదైనా రెవెన్యూ సమస్య కు సంబంధించి నిర్ణీత గడువులోపు పరిష్కారం కాని పక్షంలో ఆ విషయాన్ని కూడా సంబంధిత అర్జీదారునికి తెల్పడం జరుగుతుందని కలెక్టరు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో ప్రజా సమస్యల పరిష్కారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున, అధికారులు కూడా ప్రజా సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్, అధికారులకు సూచించారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా, వారి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు పల్లె నిద్ర కార్యక్రమం కింద ఇదే మండలంలోని సజ్జాపురం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రజల ముంగిట కే వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందున ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తొలుత అద్దంకి నియోజక వర్గ పరిధిలోని అద్దంకి అర్బన్ తో పాటు 5 మండలాల్లో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతి మండలంలోని మొదటి 5 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను 10 వేల రూపాయల నగదుతో శాలువ కప్పి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సన్మానించారు. తరువాత అద్దంకి నియోజక వర్గ పరిధిలోని 5మండలాలకు చెందిన 84 మంది లబ్ధదారులకు 69 లక్షల 16 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అందచేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ వేంకటేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



