పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి – జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు

పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఐదు గ్రామాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చిన అర్జీలలో ఆర్థిక సంబంధమైనవి, ఆర్థికేతరమైనవిగా వేరుచేసి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఆర్థిక సంబంధమైన సమస్యలు అయితే తగిన ప్రతిపాదనలు రూపొందించి తన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బడ్జెట్ తో సంబంధంలేని పనులు అయితే తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. సిమెంట్ రోడ్లు వంటి నిర్మాణ సంబంధమైన సమస్యలను ప్రజలు ప్రస్తావిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు వచ్చినప్పుడు వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. శాఖా పరంగా స్పష్టమైన నిధులు లేనప్పుడు అనుబంధ శాఖల ద్వారా సమన్వయం చేసుకొని పరిష్కరించదగ్గ సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ అన్నదాత – సుఖీభవ ‘ వంటి పథకాలలో ఆర్థిక ప్రయోజనం పొందటంలో రైతులకు ఏమైనా భూ సంబంధమైన సమస్యలు ఉంటే వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. పల్లెనిద్ర రోజున మండలంలోని అన్ని గ్రామాలకు వివిధ శాఖల జిల్లా అధికారులు పర్యటన నిమిత్తం వెళ్లినప్పుడు కేవలం సొంత శాఖలకు సంబంధించిన సమస్యలే కాకుండా గ్రామంలోని ఇతర సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గస్థాయి ‘ మీకోసం ‘ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఈ కార్యక్రమాలు పూర్తయ్యే నాటికి అన్ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను
ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, పల్లెనిద్ర కార్యక్రమ నోడల్ ఆఫీసర్ చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *