ఆటోలో మర్చిపోయిన బ్యాగును బాధితుడికి అప్పగించిన రాంగోపాల్ పేట్ పోలీసులు.

బేగంపేట మే 19(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆపరేషన్‌ కోసం దాచుకున్న డబ్బుల బ్యాగును ఆటోలో మర్చిపోయి కంగారుపడుతున్న బాధితుడికి రాంగోపాల్‌పేట పోలీసులు అండగా నిలిచారు. చాకచక్యంగా వ్యవహరించి కేవలం గంటల వ్యవధిలోనే రూ.1.20 లక్షల నగదును రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. ఈ సంఘటన నగరంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం… సాయికుమార్ అనే వ్యక్తి తన తండ్రి ఆపరేషన్ నిమిత్తం సోమవారం మధ్యాహ్నం ఆటోలో కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న కంగారులో చికిత్స కోసం తీసుకొచ్చిన రూ. 1,20,000 నగదు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. ఎంత వెతికినా ఆటో ఆనవాళ్లు దొరకకపోవడంతో లబోదిబోమంటూ రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
బాధితుడి పరిస్థితిని చూసి రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌ఓ బి. సురేష్ కుమార్ తక్షణమే స్పందించారు. క్రైమ్ స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ జి. సురేష్, కానిస్టేబుళ్లు ఎస్. ప్రమోద్ కుమార్, బి. నరసింహలతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం ఆసుపత్రి పరిసరాల్లోని, సదరు మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆటో నంబరును గుర్తించింది. సాంకేతిక ఆధారాల సాయంతో ఆటో డ్రైవర్‌ను విజయవంతంగా ట్రేస్ చేశారు.
పోలీసులు సంప్రదించిన వెంటనే స్పందించిన ఆటో డ్రైవర్, ఆ బ్యాగును తీసుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అధికారుల సమక్షంలో అందులోని రూ. 1,20,000 నగదును పైసా కూడా తగ్గకుండా భద్రంగా బాధితుడికి అప్పగించాడు. కష్టసమయంలో మెరుపు వేగంతో స్పందించి, తన తండ్రి వైద్యానికి అవసరమైన నగదును తిరిగి ఇప్పించిన రాంగోపాల్‌పేట పోలీసులకు బాధితుడు సాయి కుమార్ కన్నీటి పర్యంతమై హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ ప్రదర్శించిన నిరుపమానమైన నిజాయితీని ఎస్‌హెచ్‌ఓ బి. సురేష్ కుమార్ అభినందిస్తూ, ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే కేసును అత్యంత వేగంగా ఛేదించి, మానవత్వాన్ని చాటుకున్న క్రైమ్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *