హైదరాబాద్, మే 20,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించింది. తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’తో ఉక్కుపాదం మోపింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 544 సిమ్ కార్డులనుస్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా, 112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో
భాగస్వాములైనట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ నేరాలకు సంబంధించిన మొత్తం రూ.101.87 కోట్లు రూపాయల మోసం జరిగినట్లు గుర్తించారు.
టెలికాం నెట్వర్క్ వారీగా పరిశీలిస్తే. అరెస్టయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ కేసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో. ‘నెట్వర్క్ సరిగా లేదు’, ‘సర్వర్ డౌన్ అయ్యింది’, ‘వేలిముద్ర సరిగా పడలేదు’ అంటూ ఏజెంట్లు నమ్మబలికి.రెండు, మూడు బయోమెట్రిక్ ను తీసుకుంటున్నారు.మారుమూల గ్రామాల్లో, గిరిజనప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ లు అమ్మితే అంత కమిషన్ తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు.ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే. అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ-సిమ్(e-SIM)లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే, మన దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు.
ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.
మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ‘సెక్స్టార్షన్’ ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే ‘డిజిటల్ అరెస్ట్’ ముఠాలు సైతం ఈ నంబర్ల నే వాడుతున్నాయి. నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు. ఈ సైబర్ నెట్‌వర్క్‌ను ఛేధించడంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషి చేశాయి.కాగా,’ఘోస్ట్ సిమ్’ నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. అలాగే, డీవోటీ, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి. నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది.
‘మ్యూల్ అకౌంట్స్’ సమస్యను అరికట్టడానికి బ్యాంకుల నుంచి ఎలాగైతే
పరిష్కారాలను కోరారో ఇప్పుడు టెలికాం సంస్థల నుంచి కూడా ‘ఘోస్ట్ సిమ్’ సమస్యనునియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వారికి సూచించనుంది.ముఖ్యంగా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లపై నిఘాను పెంచడం, వారి బాధ్యతను నిర్ణయించే ఫ్రేమ్వర్క్నురూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సిమ్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియలో తప్పనిసరిగా రియల్-టైమ్ వెరిఫికేషన్ చేయాలి. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయాలి. నిబంధనలు పాటించని PoS ఏజెంట్లను, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి బ్లాక్‌లిస్ట్ చేయాలి.
ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు జారీ అవుతున్న తీరును గుర్తించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. కేవైసీ చేసే సమయంలో ‘మ్యూల్ హంటర్ డేటా’, I4C అనుమానితుల డేటాబేస్‌తో అనుసంధానం చేసి తనిఖీలు చేయాలి. టెలికాం సంస్థలు, పోలీసుల మధ్య డేటా షేరింగ్ కోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజలు ఆధార్ వివరాలు,
బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. సిమ్ కార్డులు తీసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ, కేవలం అధీకృత డీలర్ల వద్దే వాటిని కొనుగోలు చేయాలన్నారు. మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్https://tafcop.sancharsaathi.gov.in ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ ‘సంచార్ సాథీ’ పోర్టల్‌ను క్రమంతప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్‌ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలన్నారు.
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే.. ఆ మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత కీలకం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కంగారు పడకుండా.వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీస్ అందిస్తున్న ‘సి-మిత్ర’ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
