హైదరాబాద్ జులై 18,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం బలహీనపడినప్పటికీ, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. దీనికి తోడు రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతో పాటు, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు వివరించారు.
ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో శనివారం (జూలై 18న) రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇక ఆది, సోమవారాల్లో (జూలై 19, 20 తేదీల్లో) సైతం రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక.
18
Jul