బేగంపేట నవంబర్ 7 (జె ఎస్ డి ఎం న్యూస్ )
ఇంట్లో ఉంచిన సుమారు 70 నుంచి 85 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం నగర్ లోని బేగంపేట పబ్లిక్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న గోపిశెట్టి డాల్ఫీ (22) ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె తన తల్లి రాజ్యలక్ష్మితో కలిసి ఆగస్టు 30న ఇక్కడికి మారారు. నిత్యం దిండు కింద ఉంచుకునే హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 15 రకాల బంగారు ఆభరణాలను సుమారు రెండు మూడు వారాల క్రితం పరిశీలించారు.
కాగా శుక్రవారం ఇంట్లో పూజ ఉండటంతో బ్యాగ్ తెరిచి చూడగా జిప్పులన్నీ తెరిచి ఉన్నాయి. లోపల దాచిన కొన్ని ఆభరణాలు మినహా దాదాపు 70 నుంచి 85 గ్రాముల విలువైన నగలు చోరీకి గురైనట్లు గుర్తించి భోరుమన్నారు.ఇంట్లో పనిమనిషితో పాటు ఇటీవల ఇంట్లో పనులు చేసేందుకు వచ్చిన ఎలక్ట్రీషియన్ , ఇంటికొచ్చిన స్నేహితురాలు, ఏజెన్సీ ద్వారా వచ్చి ఒకటిన్నర రోజుల్లోనే వెళ్లిపోయిన మరో పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రెగ్యులర్గా వచ్చే ప్రకాశం నగర్ కే చెందిన పనిమనిషిపై వారు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ కె. సచ్చిదానందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: