హైదరాబాద్ నవంబర్ 22(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే, టీటీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. రాంగోపాల్ పేట్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాట్రగడ్డ ప్రసూన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేయడమే అందరి లక్ష్యం కావాలని పేర్కొన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా భూసేకరణ, కాలువల నిర్మాణం పూర్తికాలేదని, అయినా 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు చెప్పడం రైతులను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలపై గత పాలకులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇతర రాష్ట్రాలపై నిందలు వేయకుండా ఉన్న జలవనరులను సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు నాయుడు పేరును వివాదాల్లోకి లాగడం తగదని, అందరూ కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో టి డి పీ నాయకులు మాణిక్యం బండారు రాజు తదితరులు వున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: