ఘనంగా ఆంధ్ర కేసరి జయంతి వేడుకలు -ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలను స్పూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి ప్రజలందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి – టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సభలో వక్తల సందేశం

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలను స్పూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి ప్రజలందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎం.ఎల్.ఏ. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇన్ చార్జ్ కలెక్టర్ కె. శ్రీనివాసులు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాదరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు. టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబ సభ్యులను మరియు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను గౌరవ పూర్వకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ…ధైర్యానికి, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం టంగుటూరి ప్రకాశం పంతులు అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రుల కీర్తిని ఇనుమడింపజేసిన వ్యక్తి ప్రకాశం పంతులు అని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతిరూపం ప్రకాశం పంతులు అని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎంతో ఆదర్శవంతంగా అమలు చేసిన వ్యక్తి ప్రకాశం పంతులు అన్నారు. ఆంధ్రకేసరి చూపిన బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి సురేష్ చెప్పారు. ఆయన పేరిట జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ఏడాది చివరికి నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే
బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ధైర్యశాలి.. పుట్టిన గడ్డపై మనం ఉండటం మన అదృష్టం అన్నారు. ఆయన పేరిట ఏర్పాటైన ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒంగోలు లాయర్ పేటలో ప్రకాశం పంతులు కాంస్య విగ్రహం ఉన్న రోడ్డుకు ఆయన పేరుతో స్వాగత మార్గం (ఆర్చ్) ఏర్పాటు చేస్తున్న పనులు రెండు, మూడు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… పేదరికాన్ని అడ్డుగా భావించకుండా ఉన్నత
విద్యాభ్యాసం చేసి అనంతరం ప్రజా సేవకు అంకితమై ఆదర్శ జీవితం గడిపారని కొనియాడారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ… ప్రకాశం పంతులు స్ఫూర్తితో పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అనేక పధకాలు ప్రవేశ పెట్టి సమర్థంగా, పారదర్శకంగా వాటిని అమలు చేసేలా చర్యలుతీసుకుంటున్నట్లు చెప్పారు.
జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రకాశం పంతులు జీవిత చరిత్రను భావితరాలకు
తెలియజేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ప్రకాశం పంతులు చూపిన బాటలోజిల్లాను అభివృద్ధి చేసేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఓ.యు.డి.ఏ. చైర్మన్ మీనా కుమారి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, డి.ఆర్.ఓ. ఆర్. శ్రీలత, ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దేవరంపారు, ప్రకాశం పంతులు జన్మించిన వినోదరాయునిపాలెంలో కూడా ఆంధ్రకేసరి జయంతి వేడుకలు నిర్వహించారు. దేవరంపాడులో జరిగిన కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ కె. శ్రీనివాసులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒంగోలు మండలంలోని 12 స్వయం సహాయక సంఘాలకు రూ.49,50,000 ల ఉన్నతి, బ్యాంక్ లింకేజీ, సి.ఐ.ఎఫ్. రుణాలను అందించారు. కార్యక్రమంలో ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, డి.ఆర్.డి.ఏ. పి.డి. రవికుమార్, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, ఎం.పి.పి. మల్లిఖార్జున రెడ్డి, ఎం.పి.డి.ఓ. అజిత, తహశీల్దార్ మురళి, సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంగణంలో మొక్కలు నాటారు.వినోదరాయునిపాలెంలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జయంతి వేడుకలలో జడ్పీ టి.సి. యాదాల రత్నభారతి, ఎం.పి.పి. దంపతులు నలమలపు అంజమ్మ, కృష్ణారెడ్డి, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ, స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ బాబు, ఎం.పి.డి.ఓ. జయమణి, తహశీల్దార్ సుజన్ కుమార్, ఎం. ఈ.ఓ.లు రవి, రమణయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *