అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు. నవరత్నాలు-ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం చేతనైనా సంక్షేమ పధకాల ప్రయోజనం పొందలేని వారిని గుర్తించి లబ్ధిదారులకు వాటిని అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ కె. శ్రీవాసులుతోపాటు ట్రైనీ కలెక్టర్ శౌర్య పటేల్, మత్య్స కార్పొరేషన్ డైరెక్టర్ సుమతి, ఓ.యు.డి.ఏ. ఛైర్మన్ మీనా కుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్ పర్సన్ షేక్ సుభాన్ బి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును వారు అందించారు.
ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ …అర్హత ఉన్నప్పటికీ 2022 డిసెంబరు నుంచి సంక్షేమ పధకాల ద్వారా లబ్ధిపొందని వారిని గుర్తించి ఆయా పథకాల ద్వారా వారికి ప్రయోజనం కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ క్రమంలో జిల్లాలో 27,450 మంది లబ్ధిదారులకు రూ.27,41,27,968 లు ఆర్థిక ప్రయోజనం దక్కినట్లు తెలిపారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, వై.ఎస్.ఆర్. ఈ.బి.సి. నేస్తం, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ మరియు వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు, వై.ఎస్.ఆర్. ఆసరా పథకాలలో మిగిలిపోయిన అర్హులకు ఈ మేరకు ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు వివరించారు. ఈ పధకాల ద్వారా కలిగిన ఆర్థిక ప్రయోజనాన్ని మెరుగైన జీవనోపాధి కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, బి.సి. కార్పొరేషన్ ఈ.డి. వెంకటేశ్వరరావు, డి.ఆర్.డి.ఏ మరియు మెప్మా పి.డి. రవికుమార్, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి అంజల, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి, మత్స్య శాఖ ఏ.డి. ఉషా కిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




