సర్వసన్నద్ధము, సత్వర స్పందనతో విపత్తులను సమర్థంగా ఎదుర్కోవచ్చని సీనియర్ ఐఏఎస్ అధికారి, ‘ మురసు ‘ తుఫాను ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్ రంజిత్ బాషా అన్నారు. ఈ దిశగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన ప్రకాశం భవనంలో కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారిలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలపరంగా తీసుకున్న ముందస్తు చర్యలపై ఆరా తీశారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీర ప్రాంత మండలాలను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామన్నారు. 26 గ్రామాలు, 72 ఆవాస ప్రాంతాలను తుఫాను ప్రభావానికి ఎక్కువగా గురయ్యేవిగా గుర్తించామన్నారు. అదేవిధంగా జిల్లాలో 70 తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో రెండు పొక్లైన్లు, 5 ట్రాక్టర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులకు ఎలాంటి సమస్య రాకుండా ముందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. నవంబరు నెలకు సంబంధించిన రేషన్ సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. పరిస్థితిని బట్టి అదనపు పంపిణీ కోసం బఫర్ స్టాక్ కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 1000 విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచామని, కూలీలను కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు. విద్యుత్ జనరేటర్లను కూడా అందుబాటులో పెట్టామన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా ప్రజలు తెలియజేసేందుకు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన మొంథా తుఫానును ఎదుర్కొన్న అనుభవంతో ప్రస్తుతం అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. కేంద్ర, రాష్ట్ర విపత్తుల సహాయక బృందాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
రంజిత్ బాషా మాట్లాడుతూ .. ..తుఫాన్ వల్ల వచ్చే వర్షపు నీటిని మైనర్ ఇరిగేషన్ చెరువులకు మళ్లించాలని సూచించారు. మంగళవారం కూడా ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎత్తయిన ప్రదేశాలలో ఉన్న హోర్డింగ్ లను తొలగించాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో సంబంధిత శాఖలు అత్యంత సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పి.వి.రమణ, విపత్తుల నిర్వహణ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మాధురి,
డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిపిఓ అనుపమ, ఏపీ సీపీడీసీఎల్ ఎస్.ఈ. కట్టా వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నాగమణి, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ రమేష్ బాబు, డీఎస్ఓ పద్మశ్రీ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. రవి నాయక్, ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్.ఈ. అబూత్ అలీమ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యాన అధికారి గోపీచంద్, ఇరిగేషన్ ఈ.ఈ. శివరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: