ప్రకాశం / నవంబర్ 02 : బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడి ఒంగోలు, నెల్లూరు మధ్య తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి డా..డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. మురసు తుపాన్ నేపద్యంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి డిఎస్ బీవీ స్వామి సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. తుఫాను తగ్గేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వాగులు, వంకల సమీపంలో జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్దరించాలన్నారు.మత్స్యకారులు పడవలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని,
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు.
సింగరాయకొండ పాకల బీచ్ సముద్ర తీర ప్రాంతంలో సోమవారం పర్యటించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఈ తుపాను సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు – నరసాపురం మధ్య, ముఖ్యంగా ఒంగోలుకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. మురాసు తుపాను ధాటికి సింగరాయకొండ మండలంలోని పాకల తీరంలో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం సుమారు 40 మీటర్ల మేర ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న సంఘటన నెలకొంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని,తుపాను ప్రభావంతో సింగరాయకొండ, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని, సురక్షిత ప్రాంతాల్లో పడవలను భద్రపరుచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పాకాల తీర ప్రాంతం మరియు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి ఆయన సూచించారు. భారీ ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు బయటకు రాకూడదని, రేకులు, తాటాకు కప్పులలో నివాసం ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ తుపాను ప్రభావంతో ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణనష్టంగాని జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు మరియు మత్స్యకారులు పాల్గొన్నారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: