హైదరాబాద్ మే 15,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత్ ఔషధ రంగ వృద్ధికి దేశీయ ఉక్కు, ఉత్పాదక రంగాల బలమే పునాది అని ప్రాంతీయ సంయుక్త డి జీ ఎఫ్ టి అక్షయ్ ఎస్ అన్నారు.
దేశీయ ఔషధ రంగ ముఖచిత్రాన్ని మార్చేలా, ఫార్మా యంత్రాల తయారీలో భారత్‌ను ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలిపేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఈఈపీసీ ఇండియా ఆధ్వర్యంలో ‘ఫార్మా మాక్‌టెక్ – ల్యాబ్‌నెక్స్ట్ ఎక్స్పో 2026’ రెండో విడత సన్నాహక రోడ్‌షో శుక్రవారం భాగ్యనగరంలో అట్టహాసంగా జరిగింది. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఈ మెగా ఎక్స్పోకుసంబంధించిన వివరాలను ఈ సందర్భంగా ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో మూడో వంతు, దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా కలిగి ఉన్నహైదరాబాద్ వేదికగా ఈ చర్చా గోష్ఠి నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాంతీయ సంయుక్త డీజీఎఫ్టీ అక్షయ్ ఎస్.సి. మాట్లాడుతూ, భారత ఔషధ రంగ వృద్ధికి దేశీయ ఉక్కు, ఉత్పాదక రంగాల బలమే పునాది అని స్పష్టం చేశారు. తయారీదారులు కేవలం స్థానిక అవసరాలకే పరిమితం కాకుండా ప్రపంచ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా యంత్రాల ఉత్పత్తిని చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతికత కలిగిన పరికరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని, ఈ పరిస్థితి మారి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రత్యేక యంత్రాల ఉత్పత్తి పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం ఈఈపీసీ భారత్ కార్యనిర్వాహక డైరెక్టర్ అధిప్ మిత్ర మాట్లాడుతూ, 2030 నాటికి అమెరికాకు చేసే ఫార్మా ఎగుమతులను 130 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ‘ఫార్మా మాక్‌టెక్’ వంటి ప్రదర్శనలు కీలకంగా మారుతాయని, ఇక్కడ ప్రదర్శించేఆటోమేషన్, ప్రిసిషన్ డ్రగ్ డెలివరీ వంటి అత్యాధునిక సాంకేతికతలు తయారీదారులకు దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఫార్మా 4.0 దిశగా అడుగులు వేస్తూ డిజిటల్ పరివర్తనను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.గడిచిన ఐదేళ్లలో ఫార్మా యంత్రాల ఎగుమతులు 15.3 శాతం వృద్ధి సాధించినప్పటికీ, దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు
కొనసాగుతుండటంపై ఈ సదస్సులో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ లోటును భర్తీ చేయవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. జీడిమెట్ల, బాలానగర్ వంటి ఇంజనీరింగ్ క్లస్టర్ల భాగస్వామ్యంతో సరఫరా గొలుసును మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీడీఎస్ఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె. నరేంద్రన్, ఈసీజీసీ సీనియర్ మేనేజర్ సురేష్ బాబుతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొని తమ విలువైన సూచనలు చేశారు.
