ఉపాధి కల్పనే లక్ష్యంగా సంబంధిత శాఖలు సమిష్టిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పనపై బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో పాటు జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి మార్గం చూపించాల్సి ఉందన్నారు. సెర్ప్, మెప్మా, నైపుణ్యాభివృద్ధి విభాగాలు, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలు మరింత చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. వృత్తి విద్య కాలేజీలలో ప్రముఖ పారిశ్రామిక కంపెనీలకు చెందిన యూనిట్ల ఏర్పాటుకు
అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థులకు ఆయా పనులలో ప్రత్యక్ష అనుభవం వస్తుందన్నారు. ఈ విధంగా నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆయా రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. సెర్ప్, మెప్మా పొదుపు సంఘాలలోని మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం వివిధ వృత్తులు చేస్తున్నారని, వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని కల్పించడం ద్వారా వారి వద్ద మరింత మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పొదుపు సంఘాల మహిళలు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ఈ మహిళలు ఎక్కువగా పశుపోషణకు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలపగా, వ్యవసాయం, పశుసంవర్ధకం, ఆర్డబ్ల్యూఎస్, పరిశ్రమల శాఖ అధికారులు వారికి అండగా నిలవాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు గ్రామాలను పైలట్ గా తీసుకొని సంయుక్తంగా మినీ డైరీ ఫారాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే వివిధ రకాలుగా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలను సేకరించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం తరఫునుంచి వీరికి అవసరమైన ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ ఇప్పించడం ద్వారా జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అన్నారు. వివిధ రంగాల్లోని నిపుణుల సలహాలను కూడా తీసుకోవాలని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి కల్పిస్తున్న, భవిష్యత్తు అవకాశాలను తెలుపుతున్న బ్రోచర్‌ను ఈ సమావేశంలో కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి నారాయణ, మెప్మా పిడి శ్రీహరి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, ఉపాధి కల్పన అధికారి రమాదేవి, రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్టెప్పు సీఈవో శ్రీమన్నారాయణ, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి ( ఇన్చార్జి) రజనీకుమారి, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

