ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ….. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

            ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. ఈ రెండు శాఖల పనితీరుపై ఐవిఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో వస్తున్న ఫలితాలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపుపై మంగళవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనం, ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, డాక్టర్ల అందుబాటు, ఉచితంగా మందుల పంపిణీ, తదితర అంశాలలో జిల్లాకు దక్కిన స్థానాలపై కలెక్టర్ ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రులలో ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పీ.హెచ్.సీ / సీ. హెచ్. సీ / ఏరియా ఆసుపత్రులలో పారిశుధ్య నిర్వహణ తీరును వైద్యులు నిరంతరం గమనిస్తూ ఉండాలని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై మండల స్థాయి విద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, చిక్కీలు, కోడిగుడ్లు కూడా నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాలన్నారు. పరిస్థితిని మెరుగుపరిచిన చోట ఆయా విషయాలను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించాలని చెప్పారు. కాంట్రాక్టరైనా, అధికారులైనా విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. 
        ఈ సమావేశంలో డి.ఈ.ఓ. రంగయ్య, ఆర్.ఐ.ఓ. రాజేంద్ర, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డి.సి.హెచ్.ఎస్. విజయలక్ష్మి, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు. 

Save or share this story as a newspaper-style Epaper Clip:

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *