హైదరాబాద్ నవంబర్ 14 (జె ఎస్ డి ఎం న్యూస్ )
యువత భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన మద్దతును ప్రకటించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ నేపథ్యంలో, ఈ మహా యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా చిరంజీవిని కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన టీ-షర్టులను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ సమాజాన్ని,ముఖ్యంగా యువత
భవిష్యత్తును నాశనం చేస్తున్న
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తాము సైతం చేయూతను అందిస్తామని స్పష్టం చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్” పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: